విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు కనెక్టివిటీని పెంచడంపై ఏపీ ప్రభుత్వం గట్టి ఫోకస్ పెట్టింది. ఎయిర్పోర్ట్ ప్రారంభం అయ్యేలోపే విశాఖలోని ఏడు మాస్టర్ ప్లాన్ రోడ్ల విస్తరణను పూర్తి చేయాలని పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది. ప్రభుత్వ టార్గెట్‌కు తగ్గట్టుగానే VMRDA కూడా భూసేకరణ, రోడ్ల పనుల్లో స్పీడ్ పెంచింది. ఇంతకీ, భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు కనెక్టివిటీని పెంచే ఆ ఏడు ప్రధాన రోడ్లు ఏంటో తెలుసా?
ఉత్తరాంధ్ర ముఖచిత్రాన్ని మార్చేయనున్న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయి. వచ్చే జూన్ నాటికల్లా ఎయిర్పోర్ట్ సేవలను ప్రారంభించేలా సన్నాహాలు ముమ్మరం చేశారు. ఒక్కసారి ఈ ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వస్తే, విశాఖ నుంచి భోగాపురం వెళ్లే ప్రయాణికుల రద్దీ భారీగా పెరుగుతుంది. కానీ, ప్రస్తుతం విశాఖలో ఉన్న రోడ్ల పరిస్థితి, ట్రాఫిక్ చూస్తుంటే.. ఇక్కడి నుంచి భోగాపురం చేరుకోవడం వాహనదారులకు ఓ పెద్ద సవాల్‌గా మారనుంది.

విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోవాలంటే కనీసం నాలుగు గంటల ముందే ఇల్లు వదలాల్సి వస్తుందేమోనన్న ఆందోళన ప్రయాణికుల్లో వ్యక్తమవుతోంది. ఈ కష్టాలకు చెక్ పెట్టేందుకే ఏపీ ప్రభుత్వం ఒక స్పెషల్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించి, ఎయిర్‌పోర్ట్‌కు వేగంగా చేరుకునేలా ఏడు కీలక మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణాన్ని చేపడుతోంది.
కనెక్టివిటీ పెంచే ఆ 7 ప్రధాన రోడ్లు ఇవే..
వీఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం విశాఖలో మొత్తం 15 రోడ్లను అభివృద్ధి చేయాల్సి ఉంది. ఇందులో మొదటి విడత కింద 7 ప్రధాన రోడ్ల విస్తరణ పనులను మొదలుపెట్టారు. భూసేకరణ, అనుమతుల సమస్యలు క్లియర్ అయిన చోట పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన ఆ 7 రోడ్ల వివరాలు ఇలా ఉన్నాయి:
- తిమ్మాపురం-మారికవలస: 6.3 కి.మీ పొడవు, 30 మీటర్ల వెడల్పు
- అడవివరం-శొంఠ్యం: 8 కి.మీ పొడవు, 30 మీటర్ల వెడల్పు
- తాళ్లవలస-కొత్తవలస: 3.90 కి.మీ పొడవు, 24 మీటర్ల వెడల్పు
- బోయపాలెం-కాపులుప్పాడ: 3.10 కి.మీ పొడవు, 24 అడుగుల వెడల్పు
- వేపగుంట-పినగాడి: 3.20 కి.మీ పొడవు, 18 మీటర్ల వెడల్పు
- వేపగుంట-జుత్తాడ: 6.05 కి.మీ పొడవు, 24 మీటర్ల వెడల్పు
- భీమిలి-దొరతోట: 6.20 కి.మీ పొడవు, 30 మీటర్ల వెడల్పు
ఈ ఏడు రోడ్లలో తిమ్మాపురం మారికవలస రోడ్డు విస్తరణ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి.
పనుల పురోగతి.. ఏ ప్రాజెక్ట్ ఎవరి చేతుల్లో ఉందంటే?
మిగిలిన రోడ్ల పనుల విషయానికొస్తే.. తాళ్లవలస – కొత్తవలస రోడ్డు పనులు 36 శాతం, బోయపాలెం – కాపులుప్పాడ రోడ్డు పనులు 58 శాతం వరకు పూర్తయ్యాయి. అయితే, వేపగుంట – పినగాడి రోడ్డు విస్తరణ మాత్రం భూసేకరణ సమస్యల కారణంగా కాస్త నెమ్మదించింది.
ఇక ఈ ప్రాజెక్టుల బాధ్యతల విషయానికొస్తే.. వేపగుంట-జుత్తాడ రోడ్డును జీవీఎంసీ (GVMC), భీమిలి – దొరతోట రోడ్డును ఆర్అండ్బీ (R&B) శాఖలు నిర్మిస్తుండగా.. మిగతా రోడ్ల విస్తరణ పనులన్నింటినీ వీఎంఆర్డీఏ (VMRDA) స్వయంగా పూర్తి చేస్తోంది.
అడ్డంకులు ఉన్నా.. వెనక్కి తగ్గేదే లే!
ఈ పనుల వేగంపై వీఎంఆర్డీఏ కమిషనర్ తేజ్ భరత్ స్పందిస్తూ.. నిర్దేశించిన గడువు కంటే ముందే, సకల సౌకర్యాలతో కూడిన నాణ్యమైన రోడ్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని ధీమా వ్యక్తం చేశారు.
అయితే, ఈ ఏడు రోడ్ల మాస్టర్ ప్లాన్ అమల్లో కొన్ని అడ్డంకులు కూడా లేకపోలేదు. కొన్ని ప్రాంతాల్లో భూసేకరణ సమస్యలు, అటవీ శాఖ అనుమతులు రాకపోవడంతో పనుల్లో కాస్త జాప్యం జరుగుతోంది. ముఖ్యంగా ఆర్ అండ్ బీ వాళ్లు వేస్తున్న భీమిలి-దొరతోట రోడ్డు పనులు.. కొన్ని టెక్నికల్ సమస్యల వల్ల కాస్త లేట్ అవుతున్నాయి.
ఈ 7 రోడ్ల విస్తరణ పనుల్లో ఎదురవుతున్న అడ్డంకులను అధిగమిస్తూ అధికారులు ముందుకు సాగుతున్నారు. ప్రభుత్వ పెద్దలు కూడా ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా మంత్రి నారాయణ, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రత్యేకంగా సమీక్షలు నిర్వహిస్తూ.. అమరావతి స్థాయిలో పనుల పురోగతిపై వారం వారం ఆరా తీస్తున్నారు.
భూసేకరణ, అనుమతుల రాకలో కాస్త జాప్యం జరుగుతున్నప్పటికీ.. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పనులు ముందుకు తీసుకెళ్తామని వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ స్పష్టం చేశారు. ఏదేమైనా, అక్కడక్కడా ఎదురవుతున్న భూసేకరణ సమస్యలు, సాంకేతిక అడ్డంకులను పరిష్కరిస్తూ.. విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు కనెక్టివిటీని పూర్తి చేయడమే ప్రధాన లక్ష్యంగా అధికారులు పనిచేస్తున్నారు.











Leave a Reply