ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణంతో గల్ఫ్ దేశాల్లోని సంపన్నులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ‘సెమాఫోర్’ నివేదిక ప్రకారం.. దుబాయ్, అబుదాబి, ఖతార్, బహ్రెయిన్ తదితర ప్రాంతాల్లో ఉన్న కుబేరులు వీలైనంత త్వరగా అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం ప్రైవేట్ జెట్లు, కమర్షియల్ విమానాల కోసం వారు ఏమాత్రం వెనుకాడకుండా భారీగా డబ్బులు ఖర్చు చేస్తున్నారు.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం:
అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు సంయుక్తంగా ఇరాన్‌పై క్షిపణుల వర్షం కురిపిస్తుండగా.. ఇరాన్ కూడా ఏమాత్రం తగ్గకుండా ప్రతీకార దాడులకు దిగుతోంది. ఒకవైపు ఇజ్రాయెల్‌పై బాంబుల మోత మోగిస్తున్న ఇరాన్ సైన్యం.. మరోవైపు గల్ఫ్ దేశాల్లోని అమెరికా ఎయిర్బేస్లనే లక్ష్యంగా చేసుకుని విరుచుకుపడుతోంది. ఈ భీకర దాడుల దెబ్బకు పలు దేశాల్లో ప్రధాన విమానాశ్రయాలను మూసివేశారు. దీంతో రాకపోకలు నిలిచిపోయి వేలాది మంది ప్రయాణికులు ఎక్కడికక్కడే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
ఇరాన్ వరుస దాడులతో దుబాయ్ వణికిపోతోంది. ఇప్పటికే దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌తో సహా పలు ప్రధాన విమానాశ్రయాలు ఈ దాడుల్లో స్వల్పంగా దెబ్బతినడంతో, వాటిని తాత్కాలికంగా మూసివేసి విమానాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు.
ఈ పరిణామాలతో దుబాయ్, అబుదాబిలలో ఉంటున్న విదేశీ కుబేరులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఎలాగైనా సరే అక్కడి నుంచి సురక్షితంగా బయటపడేందుకు ప్రైవేట్ జెట్లను ఆశ్రయిస్తున్నారు. ఇందుకోసం ఎంత ఖర్చు చేయడానికైనా వారు వెనుకాడటం లేదు. ఒక్కో ప్రైవేట్ జెట్‌కు ఏకంగా రూ.3.2 కోట్ల వరకు చెల్లించడానికి కూడా సిద్ధపడుతున్నట్లు ‘న్యూయార్క్ పోస్ట్’ నివేదిక వెల్లడించింది.

దుబాయ్, అబుదాబిలలో ఉంటున్న స్థానిక కుబేరులతో పాటు విదేశీ సంపన్నులు ప్రైవేట్ భద్రతా సంస్థల సాయంతో వీలైనంత త్వరగా అక్కడి నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు. పది గంటల పాటు ప్రయాణించి సౌదీ అరేబియా చేరుకునేందుకు కొందరు లక్షలాది డాలర్లు ఖర్చు చేయడానికి కూడా వెనుకాడటం లేదు. ఒక్కసారి సౌదీ చేరుకుంటే.. అక్కడి నుంచి గల్ఫ్ దేశాలు దాటి ఇతర సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు మెరుగైన రవాణా సదుపాయాలు ఉండటమే ఇందుకు ప్రధాన కారణం.
మరోవైపు సౌదీ అరేబియా రాజధాని రియాద్ విమానాశ్రయం నుంచి విమానాల రాకపోకలు సాధారణంగానే కొనసాగుతున్నాయి. దీంతో గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయిన స్థానిక, విదేశీ కుబేరులు ఎలాగైనా సరే రియాద్ చేరుకుని.. అక్కడి నుంచి ఈ భయానక పరిస్థితుల నుంచి బయటపడాలని చూస్తున్నారు. సురక్షిత ప్రాంతాలకు చేరుకునే క్రమంలో ఎంతైనా ఖర్చు చేయడానికి వారు సిద్ధపడుతున్నారు.
సెమాఫోర్’ నివేదికల ప్రకారం.. దుబాయ్, అబుదాబి, ఖతార్, బహ్రెయిన్లలో చిక్కుకుపోయిన కుబేరులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు నానా తంటాలు పడుతున్నారు. ప్రైవేట్ జెట్లు లేదా కమర్షియల్ విమానాల ద్వారా వేరే దేశాలకు వెళ్లేందుకు వీరు రియాద్ నగరానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘కింగ్ ఖలీద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్’కు రోడ్డు మార్గంలో సుదీర్ఘ ప్రయాణం (లాంగ్ డ్రైవ్) చేసి మరీ చేరుకుంటున్నారు. ఐదు ప్యాసింజర్ టెర్మినల్స్ ఉన్న ఈ భారీ విమానాశ్రయం ప్రస్తుతం వీరికి ప్రధాన ఆశాకిరణంగా మారింది.











Leave a Reply