రామగుండం NTPC సెకండ్ ఫేజ్‌లో భాగంగా నిర్మిస్తున్న 2400 మెగావాట్ల థర్మల్ ప్రాజెక్టు నుంచి కరెంటు కొనుగోలు చేసేలా ఒప్పందం (PPA) చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను తక్కువ ఖర్చుతో తీర్చేందుకు NTPC సిద్ధంగా ఉందని, దీనివల్ల అటు ప్రభుత్వానికీ ఇటు ప్రజలకూ ఎంతో మేలు జరుగుతుందని ఆ లేఖలో పేర్కొన్నారు. అలాగే, ప్లాంట్ పూర్తిస్థాయిలో పనిచేయడానికి వీలుగా బొగ్గును సేకరించుకునే విషయంలో NTPCకి పూర్తి స్వేచ్ఛనివ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
రామగుండం ఎన్టీపీసీ థర్మల్ పవర్ ప్రాజెక్టు సెకండ్ ఫేజ్‌లో భాగంగా 2,400 మెగావాట్ల సామర్థ్యమున్న మిగతా మూడు యూనిట్లను పూర్తి చేయడానికి ఎన్టీపీసీ చర్యలు చేపట్టిందని ఆయన వివరించారు. ఫస్ట్ ఫేజ్ తరహాలోనే, ఈ సెకండ్ ఫేజ్‌లో ఉత్పత్తి అయ్యే కరెంటులోనూ ఏకంగా 85 శాతం తెలంగాణకే ఇస్తామని స్పష్టం చేశారు. 2026 మార్చి 3న రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా 18,139 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ నమోదైందని, భవిష్యత్తులో ఈ కరెంటు అవసరాలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆయన గుర్తుచేశారు.
ఈ పెరుగుతున్న డిమాండ్‌కు తగ్గట్టుగా విద్యుత్ వనరులను సమకూర్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టిన విషయం తనకు తెలుసన్నారు. ఇటీవల విద్యుత్ రంగంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. గ్రిడ్ స్థిరత్వాన్ని కాపాడటం కోసం రాష్ట్రంలో మరో 5,000 నుంచి 6,000 మెగావాట్ల థర్మల్ కరెంటు ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉందని చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.

2047 నాటికి రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ ఏకంగా లక్ష మెగావాట్లకు చేరుకుంటుందని భట్టి అంచనా వేశారని.. అందుకోసమే కొత్తగా 2,400 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర కేబినెట్ కూడా నిర్ణయం తీసుకున్నట్లు తమకు సమాచారం ఉందన్నారు.
అత్యాధునిక అల్ట్రా సూపర్ క్రిటికల్ టెక్నాలజీని ఉపయోగించి, అతి తక్కువ ఖర్చుతో థర్మల్ పవర్ ప్లాంట్లను నిర్మించడంలో ఎన్టీపీసీకి దేశంలోనే అపారమైన అనుభవం ఉందని ఆయన వివరించారు. ఈ మొత్తం 4,000 మెగావాట్ల ప్రాజెక్టుకు సరిపడా బొగ్గును సేకరించుకునే విషయంలో ఎన్టీపీసీకి గనక పూర్తి స్వేచ్ఛనిస్తే.. నాణ్యమైన కరెంటును తక్కువ ధరకే ఉత్పత్తి చేసి తెలంగాణ విద్యుత్ అవసరాలను తీర్చేందుకు ఆ సంస్థ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
దీనివల్ల అటు ప్రభుత్వానికీ, ఇటు ప్రజలకూ ఎంతో మేలు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. అత్యాధునిక టెక్నాలజీతో తక్కువ ఖర్చుకే కరెంటు ఉత్పత్తి అవుతుండటంతో, ఇతర దక్షిణాది రాష్ట్రాలు కూడా ఎన్టీపీసీ నుంచి విద్యుత్ కొనుగోలు చేయడానికి ఒప్పందాలు (PPAs) చేసుకుంటాయని తెలిపారు.
కాబట్టి, విద్యుత్ రంగంలో అపార అనుభవం ఉన్న ఎన్టీపీసీ రామగుండం సెకండ్ ఫేజ్‌లో ఏర్పాటు చేయనున్న 2,400 మెగావాట్ల థర్మల్ ప్రాజెక్టుతో తెలంగాణ ప్రభుత్వం కరెంటు కొనుగోలు ఒప్పందం చేసుకునేలా చొరవ చూపాలని కోరారు. రాష్ట్రానికీ, ప్రజలకూ ఎంతో ప్రయోజనం చేకూర్చే ఈ ప్రాజెక్టుకు సంపూర్ణ సహకారం అందించాలని కేంద్ర మంత్రి ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు.











Leave a Reply