యూపీఎస్సీ సివిల్స్ 2025 ఫలితాలు వచ్చేశాయి! మార్చి 6న విడుదలైన ఈ రిజల్ట్స్‌లో మొత్తం 1,087 పోస్టులకు గానూ 958 మంది తుది జాబితాలో సెలెక్ట్ అయ్యారు.
ఆగస్టు 2025లో ప్రిలిమ్స్, డిసెంబర్లో మెయిన్స్, ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇంటర్వ్యూలు పూర్తిచేసుకున్న యూపీఎస్సీ సివిల్స్ 2025 తుది ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్ తదితర కేంద్ర సర్వీసుల కోసం మొత్తం 958 మందిని ఎంపిక చేశారు. వీరిలో అనుజ్ అగ్నిహోత్రి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ (జనరల్ కేటగిరీ) సాధించారు. వృత్తిరీత్యా డాక్టర్ అయిన ఆయన, ప్రజలకు మరింత సేవ చేయాలన్న లక్ష్యంతో సివిల్స్ వైపు అడుగులేసి, ఏకంగా టాపర్‌గా నిలిచారు.
అనుజ్ నేపథ్యం చూస్తే.. ఆయన స్వస్థలం రాజస్థాన్‌లోని కోట దగ్గర ఉన్న రావత్భట అనే చిన్న పట్టణం. అక్కడే ప్రాథమిక విద్య పూర్తి చేసి, ఆపై ఉన్నత చదువుల కోసం జోధ్‌పూర్ వెళ్లారు. ఎయిమ్స్ (AIIMS) జోధ్‌పూర్‌లో ఎంబీబీఎస్ పూర్తి చేసి, 2023లో డాక్టర్‌గా పట్టా అందుకున్నారు. ఆ తర్వాతే సివిల్స్ వైపు అడుగులు వేశారు. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ మాక్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. “నా ఐదేళ్ల ఎంబీబీఎస్ చదువు కంటే సివిల్స్ ప్రిపరేషన్ చాలా కష్టంగా అనిపించింది, ఇదొక సరికొత్త సవాల్” అని తన అనుభవాలను పంచుకున్నారు.
సివిల్ సర్వీసెస్‌ను ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఆ పదవికి ఉండే బాధ్యతలే అని అనుజ్ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ప్రజలకు నేరుగా సేవ చేయాలన్న ఉద్దేశంతోనే ఈ రంగం వైపు వచ్చానని ఆయన తెలిపారు. ఒకే తరహా వృత్తిలో ఉండిపోకుండా, పాలనాపరంగా విభిన్న రంగాల్లో అనుభవం సొంతం చేసుకోవాలన్న కోరికతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
సక్సెస్ కి కారణం ఇదే..
తన సక్సెస్ సీక్రెట్ గురించి చెబుతూ.. ప్రిపరేషన్ సమయంలో మొబైల్, సోషల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉండి కేవలం చదువుపైనే శ్రద్ధ పెట్టానని అనుజ్ వెల్లడించారు. జనరల్ కేటగిరీలో ఈ అద్భుత విజయం సాధించిన ఆయనకు.. తీరిక సమయాల్లో క్రికెట్ ఆడటం, స్టాండ్-అప్ కామెడీ చూడటం అంటే చాలా ఇష్టం.











Leave a Reply