గల్ఫ్ దేశాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో, దేశంలో పెట్రోల్, డీజిల్ కొరత రాకుండా కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తోంది. తాజాగా చమురు, గ్యాస్ నిల్వలపై ఓ కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం భారత్ వద్ద దాదాపు 100 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు నిల్వలు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేసింది. అలాగే, భవిష్యత్తు అవసరాల కోసం ప్రత్యామ్నాయ మార్గాలపై కూడా దృష్టి సారించినట్లు వెల్లడించింది.
గల్ఫ్ దేశాల్లో నెలకొన్న సంక్షోభం కారణంగా హార్ముజ్ జలసంధి గుండా ముడి చమురు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ యుద్ధ వాతావరణం కనీసం నెల రోజుల పాటు కొనసాగవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా దెబ్బతిని, ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉంది. అయితే, ఈ విషయంలో భారత్కు ఎలాంటి ఆందోళన అవసరం లేదు. మన దేశంలో 45 రోజులకు సరిపడా చమురు నిల్వలు సురక్షితంగా ఉన్నాయి. కాబట్టి, ప్రస్తుత ఉద్రిక్తతలు మన దేశ ప్రగతికి ఎలాంటి ఆటంకం కలిగించవు. పెట్రో ఉత్పత్తుల కొరత రాకుండా కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ తగిన ముందస్తు చర్యలు తీసుకుంటోంది.

ఇరాన్ సంక్షోభం కారణంగా హార్ముజ్ జలసంధి గుండా రాకపోకలు నిలిచిపోయాయి. దీనివల్ల దాదాపు 40 నుంచి 45 రోజుల పాటు చమురు సరఫరాకు అంతరాయం కలగొచ్చని తెలుస్తోంది. అయినా సరే, భారతదేశంలో తగినన్ని ముడి చమురు నిల్వలు సురక్షితంగా ఉన్నాయని ఇంధన మార్కెట్ విశ్లేషణ సంస్థ ‘కెప్లర్’ అంచనా వేసింది. కెప్లర్ వివరాల ప్రకారం.. భారత్ వద్ద ప్రస్తుతం సుమారు 100 మిలియన్ బ్యారెళ్ల వాణిజ్య ముడి చమురు నిల్వలు అందుబాటులో ఉన్నాయి. దేశంలోని రిఫైనరీలు, వ్యూహాత్మక భూగర్భ నిల్వలతో (SPR) పాటు సముద్ర మార్గంలో నౌకల్లో వస్తున్న చమురును కూడా కలుపుకుని ఈ అంచనా వేశారు. వాస్తవానికి భారత్ తన చమురు అవసరాల్లో 88 శాతాన్ని ఇతర దేశాల నుంచే దిగుమతి చేసుకుంటోంది. ఇందులో సగానికి పైగా వాటా పశ్చిమాసియా దేశాలదే కావడం గమనార్హం.
మన దేశానికి వచ్చే ముడి చమురులో ఎక్కువ భాగం హార్ముజ్ జలసంధి గుండానే వస్తుంది. లెక్కల ప్రకారం.. భారత్ రోజుకు సుమారు 5 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును ఇతర దేశాల నుంచి కొనుగోలు చేస్తుంటే, అందులో ఏకంగా 2.5 మిలియన్ బ్యారెళ్లు కేవలం ఈ హార్ముజ్ మార్గం ద్వారానే మనకు చేరుతున్నాయి.
పశ్చిమాసియా నుంచి చమురు సరఫరాలో తాత్కాలికంగా అంతరాయం ఏర్పడితే, ఆ ప్రభావం తక్షణమే పెట్రో ఉత్పత్తుల సరఫరా, ధరలపై పడుతుందని కెప్లర్ ప్రధాన పరిశోధన విశ్లేషకుడు సుమిత్ రిటోలియా అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ, రిఫైనరీల వద్ద ఉండే వాణిజ్య నిల్వలు, ఇప్పటికే సముద్ర మార్గంలో వస్తున్న చమురు నౌకల వల్ల కొంతకాలం పాటు ఊరట లభిస్తుందని తెలిపారు. ఒకవేళ ఈ సంక్షోభం దీర్ఘకాలం పాటు కొనసాగితే మాత్రం.. ప్రత్యామ్నాయ మార్గాలను ఆశ్రయించాల్సి రావడం, పెరిగే రవాణా ఛార్జీల వల్ల చమురు దిగుమతుల భారం దేశంపై గణనీయంగా పెరుగుతుందని ఆయన విశ్లేషించారు.
అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్కు 80 డాలర్లు దాటింది. ఇరాన్ సంక్షోభం మొదలవక ముందున్న ధరతో పోలిస్తే ఇది దాదాపు 10 శాతం ఎక్కువ. కాగా, గత ఆర్థిక సంవత్సరంలో ముడి చమురు దిగుమతుల కోసం భారత్ ఏకంగా 137 బిలియన్ డాలర్లు వెచ్చించింది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జనవరి మధ్య కాలంలోనే 206.3 మిలియన్ టన్నుల ముడి చమురు కొనుగోలుకు 100.4 బిలియన్ డాలర్లు ఖర్చు చేసినట్లు తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
తాజా మీడియా కథనాల ప్రకారం.. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా హార్ముజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పర్షియన్ గల్ఫ్ను అరేబియా సముద్రంతో కలిపే ఈ 33 కిలోమీటర్ల సముద్ర మార్గం అత్యంత కీలకమైనది. ప్రపంచవ్యాప్తంగా జరిగే ముడి చమురు ఎగుమతుల్లో దాదాపు మూడొంతుల్లో ఒక వంతు, అలాగే 20 శాతం గ్యాస్ సరఫరా ఈ మార్గం గుండానే జరుగుతుంది. అయితే, ఈ ఇబ్బందిని అధిగమించడానికి భారత్కు ప్రత్యామ్నాయాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. పశ్చిమ ఆఫ్రికా, లాటిన్ అమెరికా, అమెరికా తదితర దేశాల నుంచి అదనపు సరఫరాలను పొందడం ద్వారా ఈ లోటును భర్తీ చేసుకోవచ్చని చెబుతున్నారు. అవసరమైతే రష్యా నుంచి మరింత చమురును దిగుమతి చేసుకునే అవకాశం కూడా భారత్కు ఉంది.
నిపుణుల అంచనాల ప్రకారం.. ప్రస్తుతానికి భౌతిక చమురు కొరత కన్నా, ధరల్లో హెచ్చుతగ్గులు, దిగుమతి భారం పెరగడమే తక్షణ ముప్పుగా కనిపిస్తోంది. అయితే, ఈ అంతరాయం దీర్ఘకాలం పాటు తీవ్ర స్థాయిలో కొనసాగితే మాత్రం దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పడుతుందని, చమురు దిగుమతుల బిల్లు అమాంతం పెరిగే ప్రమాదం ఉందని ఆర్థిక విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
-గల్ఫ్ నుంచి తరలిపోతున్న కుబేరులు











Leave a Reply