2026 టీ20 వరల్డ్ కప్ అసలైన నాకౌట్ ఫైట్‌కు రెడీ అయింది. సెమీస్‌లో భారత్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లండ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. అయితే సెమీస్‌లో గెలిచి భారత్ ఫైనల్ అడుగుపెడితే, అక్కడ రెండు ప్రధాన సమస్యలు పొంచి ఉన్నాయి. ఒకవైపు ప్రమాదకరమైన దక్షిణాఫ్రికాతో పాటు, అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం పిచ్ కూడా టీమిండియాకు గట్టి సవాల్ విసరనుంది. ఈ రెండు అడ్డంకులను మనవాళ్లు ఎలా ఎదుర్కొంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
2026 టీ20 ప్రపంచకప్‌లో నాకౌట్ సమరం మొదలైంది. భారత్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లండ్ సెమీస్‌లో అడుగుపెట్టాయి. కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే తొలి సెమీస్‌లో దక్షిణాఫ్రికా-న్యూజిలాండ్ తలపడనుండగా.. ఆ మరుసటి రోజు ముంబై వాంఖడే స్టేడియంలో జరిగే రెండో సెమీస్‌లో భారత్-ఇంగ్లండ్ తలపడనున్నాయి. ఈ సెమీస్ పోరులో గెలిచిన రెండు జట్లు ఫైనల్ చేరుకుంటాయి.
ఒకవేళ సెమీస్‌లో ఇంగ్లండ్‌ను చిత్తు చేసి టీమిండియా ఫైనల్ చేరినా.. కప్పు గెలవాలంటే రెండు అతిపెద్ద గండాలను దాటక తప్పదు. అందులో మొదటి ముప్పు దక్షిణాఫ్రికా రూపంలో పొంచి ఉంది. తొలి సెమీస్‌లో న్యూజిలాండ్‌పై నెగ్గి సఫారీలు ఫైనల్‌కు వస్తే.. అది భారత్‌కు కఠిన సవాలే. ఎందుకంటే, 2024 వరల్డ్ కప్ ఫైనల్లో తృటిలో కప్పు చేజార్చుకున్న ఆ జట్టు.. ఈసారి ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలనే కసితో ఉంది.

ఈ టీ20 వరల్డ్ కప్ సూపర్-8 దశలో కూడా భారత్‌పై దక్షిణాఫ్రికాదే పైచేయి కావడం గమనార్హం. ఒకవేళ ఫైనల్లో మళ్లీ సఫారీ జట్టు ఎదురైతే టీమిండియాకు అది కత్తిమీద సామే. వారి ప్రస్తుత ఫామ్, తాజా విజయాల రికార్డు చూస్తుంటే.. టైటిల్ పోరులో భారత్‌కు గట్టి పోటీ తప్పదని అర్థమవుతోంది.
రెండో సవాల్ విషయానికొస్తే.. అది అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం! ఫైనల్ వేదిక అనగానే సగటు అభిమాని గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. గత రికార్డులు చూస్తే ఈ పిచ్ టీమిండియాకు ఏమాత్రం అచ్చిరాలేదు. 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో కంగారూల చేతిలో ఎదురైన పరాభవం అంత తేలిగ్గా చెరిగిపోయేది కాదు. పైగా, తాజా టోర్నీ సూపర్-8లో సఫారీల చేతిలో దెబ్బతిన్నది కూడా ఇక్కడే. అచ్చిరాని ఈ గ్రౌండ్లో, ఫుల్ ఫామ్‌లో ఉన్న సౌతాఫ్రికాతో ఫైనల్ పోరు టీమిండియాకు ఎంతవరకు కలిసివస్తుందనే దానిపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇక అసలు విషయానికొస్తే.. అహ్మదాబాద్ పిచ్ కండిషన్స్ పూర్తిగా సౌతాఫ్రికాకే అనుకూలంగా ఉన్నాయి. ఈ టోర్నీలో ఇక్కడ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ సఫారీలు విజయఢంకా మోగించారు. పరిస్థితి చూస్తుంటే ఈ గ్రౌండ్ ఇండియా కంటే వాళ్లకే లోకల్ గ్రౌండ్లా మారిపోయినట్లు కనిపిస్తోంది. మనకు ఏమాత్రం కలిసిరాని ఈ మైదానంలో.. ఊపుమీదున్న దక్షిణాఫ్రికాతో ఫైనల్ పోరు టీమిండియాకు అగ్నిపరీక్షే. మరి ఈ గండాలన్నీ దాటి టీమిండియా వరల్డ్ కప్ కలను ఎలా నిజం చేసుకుంటుందో వేచి చూడక తప్పదు.











Leave a Reply