—మనదేశం న్యూస్ డెస్క్
ఆన్లైన్ రైల్వే టికెట్ల బుకింగ్, బెర్త్‌ల కేటాయింపు ప్రక్రియపై రైల్వేశాఖ స్పష్టతనిచ్చింది. ప్రయాణికుల కేటగిరీల ఆధారంగా బెర్త్‌లు కేటాయించేందుకు పలు నిబంధనలను అమలు చేస్తోంది. ఈ ప్రక్రియ కోసం ప్రత్యేకంగా ‘కంప్యూటరైజ్డ్ రిజర్వేషన్ వ్యవస్థ’ను అందుబాటులోకి తెచ్చింది.
ఆన్లైన్ బుకింగ్ సమయంలో ప్రయాణికులు ఇచ్చే వివరాలు, ప్రాధాన్యతల ఆధారంగా సిస్టమ్ ఆటోమేటిక్‌గా బెర్త్‌లను కేటాయిస్తుంది. అందుకే, టికెట్ బుక్ చేసుకునేటప్పుడే మీకు ఏ బెర్త్ కావాలో స్పష్టంగా ఎంచుకోవాలి. మీరు ఎంచుకున్న ఆప్షన్‌కే సిస్టమ్ తొలి ప్రాధాన్యత ఇస్తుంది. ఈ నిబంధనల గురించి వివరిస్తూ రైల్వేశాఖ తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది.
నిబంధనల ప్రకారం సీనియర్ సిటిజన్లు, 45 ఏళ్లు దాటిన మహిళలు, గర్భిణులకు రైళ్లలో లోయర్ బెర్త్‌లు ఇవ్వాల్సి ఉండగా.. ఓ 82 ఏళ్ల వృద్ధురాలికి అప్పర్ బెర్త్ కేటాయించడంపై ఓ నెటిజన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. రైళ్లలో ఖాళీలు ఉన్నా పై బెర్త్ ఇచ్చారని, లోయర్ బెర్త్‌లను మాత్రం ప్రీమియం తత్కాల్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఎక్స్ (ట్విట్టర్)లో ఆరోపించాడు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, ఐఆర్సీటీసీలను ట్యాగ్ చేస్తూ ఆయన చేసిన పోస్ట్‌పై ఐఆర్సీటీసీ తాజాగా స్పందించి క్లారిటీ ఇచ్చింది.
Booked ticket for 82 year old lady and @IRCTCofficial allotted upper berth (even though there were many seats available). Now the same lower berths will be sold at high rates in premium tatkal 👏
— babu bisleri (@baabuOP) February 28, 2026
Also well done in removing senior citizen quota @AshwiniVaishnaw
లోయర్ బెర్త్‌ల కేటాయింపుపై ఐఆర్సీటీసీ స్పందిస్తూ.. “కంప్యూటరైజ్డ్ సిస్టమ్ ద్వారా 45 ఏళ్లు దాటిన మహిళలు, సీనియర్ సిటిజన్లకు ఆటోమేటిక్‌గా లోయర్ బెర్త్ కేటాయించే నిబంధన ఉన్నప్పటికీ, అది కేవలం సీట్ల లభ్యతపైనే ఆధారపడి ఉంటుంది. టికెట్ బుక్ చేసే సమయంలోనే ప్రయాణికులు ‘లోయర్ బెర్త్’ ఆప్షన్ ఎంచుకోవాలి. అప్పుడు ఖాళీగా ఉంటేనే సిస్టమ్ దానిని కేటాయిస్తుంది. కచ్చితంగా కింద సీటే కావాలనుకుంటే, ‘లోయర్ బెర్త్ ఉంటేనే టికెట్ కన్ఫర్మ్ కావాలి’ (Book, only if lower berth is allotted) అనే ఆప్షన్‌ను ఉపయోగించుకోవచ్చు. ఈ ఆప్షన్లు ఏవీ ఎంచుకోకపోతే మాత్రం, అప్పుడున్న ఖాళీలను బట్టి సిస్టమ్ ఆటోమేటిక్‌గా అప్పర్ బెర్త్‌ను కేటాయించే అవకాశం ఉంటుంది” అని స్పష్టం చేసింది.











Leave a Reply