సాధారణంగా మందు వ్యసనం నుంచి బయటపడటానికి డి-అడిక్షన్ సెంటర్లకు వెళ్తుంటారు. అయితే, ఏపీలోని శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి దేవాలయం మాత్రం ఇప్పుడు ఓ ఆధ్యాత్మిక డి-అడిక్షన్ సెంటర్‌గా సేవలందిస్తోంది. రాయలసీమ వ్యాప్తంగా ఎంతో మందిలో పరివర్తన తేవడానికి ఈ గుడి ఇప్పుడు చిరునామాగా మారింది.
2005లో అనంతపురం జిల్లా ఉంతకల్లు (బొమ్మనహల్ మండలం) గ్రామంలో వెలసిన ఈ గుడికి ఓ విశిష్టత ఉంది. ఇక్కడ పాండురంగ మాల ధరిస్తే మద్యం అలవాటు ఇట్టే మానేస్తారని భక్తుల నమ్మకం. ప్రతి ఏకాదశికి దాదాపు 2,000 మంది ఇక్కడికి వచ్చి దీక్ష తీసుకుంటుంటారు. మాల వేశాక మళ్లీ మందు తాగితే స్వామికి ఆగ్రహం వస్తుందన్న భయమే వాళ్లను ఆ వ్యసనం వైపు వెళ్లకుండా అడ్డుకుంటోంది.
ఈ దీక్ష 41 రోజుల పాటు సాగుతుంది. ఈ రోజుల్లో పొద్దున్నే స్నానాలు, భజనలు, పూజలతో పాటు సాత్విక ఆహారం తీసుకుంటూ నేలపైనే పడుకోవాలి. ఇలాంటి కఠిన నియమాల వల్ల వాళ్ల జీవనశైలి పూర్తిగా మారిపోయి జీవితం ఓ కొత్త మలుపు తిరుగుతుంది. ఏకబిగిన 41 రోజులు ఈ దినచర్యను పాటించడం వల్ల మందు తాగాలన్న ధ్యాసే క్రమంగా పోతుందని దీక్ష తీసుకున్నవారు చెప్తున్నారు.

మందు వల్ల సర్వస్వం కోల్పోయి రోడ్డున పడ్డ కుటుంబాలెన్నో! కానీ, ఇక్కడ మాల వేసుకున్నాక వ్యసనాన్ని వదిలేసి చక్కగా బతుకుతున్న వాళ్లే ఈ దేవాలయానికి నిలువెత్తు సాక్ష్యాలు. కేవలం మన రాష్ట్రం నుంచే కాదు, పక్కనున్న కర్ణాటక, మహారాష్ట్రల నుంచి కూడా జనాలు ప్రతి ఏకాదశికి వచ్చి దీక్ష తీసుకుంటున్నారు. వేలకు వేలు పోసి డి-అడిక్షన్ సెంటర్ల చుట్టూ తిరిగి విసిగిపోయిన వాళ్లు సైతం.. ఇక్కడ ఉచితంగా, కేవలం భక్తితో మాల వేసుకుని ఈ మహమ్మారి నుంచి బయటపడుతున్నారని ఊరివాళ్లు చెబుతున్నారు.
దీక్ష పూర్తయిన 41 రోజుల తర్వాత కూడా వాళ్లు మళ్లీ మందు జోలికి పోకపోవడంతో భక్తుల్లో నమ్మకం బాగా బలపడింది. ఆ నమ్మకంతోనే ఈ చిన్న పల్లెటూరి పాండురంగ స్వామి గుడి ఇప్పుడు ఏకంగా ఒక ఆధ్యాత్మిక డి-అడిక్షన్ సెంటర్‌గా మారిపోయింది. మరి ఇది దైవానుగ్రహమా లేక వాళ్ల నమ్మకమా అన్నది తెలియాలంటే ఉంతకల్లు వెళ్లి చూడాల్సిందే.







Leave a Reply