గంగిగోవు పాలు గరిటెడైన చాలు, కడివెడైననేమి ఖరము పాలు’ అనేది పాత మాట. ఇప్పుడు కాలం మారింది, గాడిదలకు మంచి రోజులొచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో కొందరు గాడిదలను పెంచి వాటి పాలతో సౌందర్య సాధనాలు తయారు చేస్తుంటే.. మరికొందరు ఆ గాడిదలను ఊరూరా తిప్పుతూ వాటి పాలను అధిక ధరలకు అమ్ముతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో గాడిదల పెంపకం బాగా పెరిగింది. కొందరు వీటి పాలతో సౌందర్య సాధనాలు తయారు చేస్తుంటే, మరికొందరు పాలను అధిక ధరలకు విక్రయిస్తున్నారు. వీరికి అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక తీపి కబురు చెప్పింది. గాడిదలను పెంచే వారికి ఏకంగా రూ. 50 లక్షల వరకు ఆర్థిక సాయం ఇస్తోంది. ఇది నమ్మశక్యంగా లేకపోయినా ముమ్మాటికీ నిజం.
దేశవ్యాప్తంగా గాడిదల సంఖ్య వేగంగా తగ్గిపోతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వాటి సంఖ్యను తిరిగి పెంచే లక్ష్యంతో, గాడిదల పెంపకాన్ని కూడా ‘నేషనల్ లైవ్‌స్టాక్ మిషన్ (NLM)’ పథకంలో చేర్చింది.
ప్రభుత్వ నివేదికల ప్రకారం మన దేశంలో గాడిదల సంఖ్య 60 శాతం మేర తగ్గిపోయింది. ఈ కొరతను అధిగమించేందుకు కేంద్రం నడుంబిగించింది. ఎఫ్‌పీవోలు (FPO), స్వయం సహాయక సంఘాలు, సెక్షన్ 8 కంపెనీల ద్వారా గాడిదలు, గుర్రాలు, ఒంటెలను పెంచేందుకు ముందుకొస్తే.. ప్రాజెక్ట్ ఖర్చులో సగం (50%) సబ్సిడీగా ఇస్తోంది. గరిష్టంగా రూ. 50 లక్షల వరకు ఈ సాయం అందుతుంది. అంటే.. కోటి రూపాయల ప్రాజెక్ట్ పెడితే, అందులో 50 లక్షలు కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది.
2019 జాతీయ పశుగణన ప్రకారం దేశవ్యాప్తంగా గాడిదల సంఖ్య 1.23 లక్షలకు పరిమితమైంది. ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లో వీటి సంఖ్య మెరుగ్గానే ఉంది. కానీ, కొన్ని రాష్ట్రాల్లో వీటి సంఖ్య కేవలం 2 నుంచి 10కి పడిపోవడమే అత్యంత ఆందోళనకరం. ఈ పరిస్థితిని చక్కదిద్ది, గాడిద జాతులను సంరక్షించడానికి.. అలాగే వాటి పాల ఉత్పత్తులను మార్కెట్లోకి తేవడానికి ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది.
గాడిద పాలను ఆహార పదార్థంగా (ఫుడ్ ఐటమ్) గుర్తించాలంటూ FSSAIకి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. అలాగే, వీటి జాతి సంరక్షణ కోసం కృషి చేసే రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా రూ.10 కోట్ల వరకు భారీ సాయం అందిస్తోంది. 2015లో ప్రారంభమైన నేషనల్ లైవ్‌స్టాక్ మిషన్ ద్వారా పశు జాతుల అభివృద్ధి, బ్రీడింగ్ సెంటర్లపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. పెట్టుబడిలో 50 శాతం ప్రభుత్వమే ఇస్తుండటంతో.. రైతులు, నిరుద్యోగులు ఈ రంగంలో ఉపాధి పొందేందుకు మంచి అవకాశం దొరికినట్లయింది.











Leave a Reply