తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత అప్పుడే మొదలైంది. మార్చి నెలలోనే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరుకోవడంతో వాతావరణ శాఖ ప్రజలను అప్రమత్తం చేసింది. రాబోయే రోజుల్లో ఈ వేడి మరింత పెరిగే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది.
తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే వేసవి తాపం మొదలైంది. ఎండలకు తోడు ఉక్కబోత కూడా తోడవడంతో జనాలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. మధ్యాహ్నం పూట బయటకు రావాలంటేనే భయపడుతున్నారు.
రాబోయే ఐదు రోజుల్లో ఏపీ, తెలంగాణల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎండ తీవ్రత నుంచి రక్షించుకోవడానికి, వడదెబ్బ బారిన పడకుండా ఉండటానికి ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఈ నేపథ్యంలో రానున్న ఐదు రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు చూద్దాం.
ఏపీ ప్రజలకు అలర్ట్
ఏపీ వాసులకు వాతావరణ శాఖ అలర్ట్! మన్నార్ గల్ఫ్ నుంచి కర్ణాటక వరకు ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రాష్ట్రం మీదుగా నైరుతి గాలులు వీస్తున్నాయి. దీని కారణంగా ఈ ఆది, సోమవారాల్లో ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లోని ఒకటి రెండు చోట్ల ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఒకటి రెండు చోట్ల ఉరుములు, మెరుపులు వచ్చే అవకాశం ఉందని, ఎల్లుండికి వాతావరణం మళ్లీ పొడిగా మారుతుందని అధికారులు చెప్పారు. ఇక దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో అయితే రాబోయే మూడు రోజుల పాటు వాతావరణం పూర్తిగా పొడిగానే ఉండనుంది.
మరోవైపు.. రానున్న 5 రోజుల్లో ఏపీ, యానాంలలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 1 నుంచి 3 డిగ్రీల వరకు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాతి రెండు రోజుల్లో ఈ ఎండల తీవ్రత మరింత పెరిగే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
తెలంగాణ ప్రజలకు అలర్ట్
ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ప్రస్తుతం రాష్ట్రంలో దక్షిణ, ఆగ్నేయ దిశల నుంచి గాలులు వీస్తున్నాయి. నిన్నటి వరకు ఒడిశా నుంచి కర్ణాటక తీరం వరకు కొనసాగిన ద్రోణి ఇప్పుడు బలహీనపడింది. దీనివల్ల ఇవాళ, రేపు, ఎల్లుండి రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం పూర్తిగా పొడిగా మారనుంది. ఈ పరిణామాలతో రానున్న రెండు రోజుల్లో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల వరకు అదనంగా నమోదయ్యే ప్రమాదం ఉందని అధికారులు స్పష్టం చేశారు.











Leave a Reply