ఒకవైపు అమెరికా-ఇరాన్ యుద్ధ పరిస్థితులు సింగరేణి సంస్థను కలవరపెడుతుంటే.. మరోవైపు బొగ్గు ఉత్పత్తి ఆందోళన కలిగిస్తోంది.
2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 72 మిలియన్ టన్నుల బొగ్గును వెలికితీయాలని సింగరేణి లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, మార్చి 13 నాటికి 67.78 మిలియన్ టన్నుల ఉత్పత్తికి చేరుకోవాల్సి ఉండగా.. కేవలం 55 మిలియన్ టన్నుల (81.23 శాతం) ఉత్పత్తిని మాత్రమే సాధించింది. నిర్దేశించుకున్న వార్షిక లక్ష్యాన్ని చేరుకోవాలంటే సింగరేణి ఇంకా 17 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయాల్సి ఉంది.

ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు కేవలం 18 రోజులే గడువు ఉంది. రోజూ 2.80 లక్షల టన్నుల బొగ్గు తీయాల్సి ఉంటే.. ఇప్పుడు కేవలం 1.70 లక్షల టన్నులు మాత్రమే బయటకు వస్తోంది. ఎలాగైనా కనీసం 70 మిలియన్ టన్నుల లక్ష్యాన్నైనా చేరుకోవాలని ఆపసోపాలు పడుతున్న సింగరేణికి.. తాజా యుద్ధ పరిస్థితులు శరాఘాతంగా మారాయి. యుద్ధం ఎఫెక్ట్‌తో డీజిల్, పేలుడు పదార్థాల కొరత తీవ్రం కావడంతో బొగ్గు ఉత్పత్తికి పెద్ద ఆటంకం ఏర్పడింది.
భారీగా తగ్గిన పేలుడు పదార్థాల సరఫరా
సింగరేణిలో భూగర్భ గనులతో పాటు ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుల్లో (ఓసీపీ) మట్టిని (ఓవర్ బర్డెన్), బొగ్గును వెలికితీయడానికి ప్రధానంగా పేలుడు పదార్థాలపైనే ఆధారపడాల్సి వస్తోంది.
సంస్థకు ఏటా ఏకంగా 3 లక్షల టన్నుల పేలుడు పదార్థాలు అవసరమవుతాయి. ముఖ్యంగా ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి జరగాలంటే.. రోజూ 800 టన్నుల సైట్ మిక్స్డ్ ఎమల్షన్ (SME) కావాలి. అయితే, సాధారణంగానే ప్రతి వేసవిలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ఎక్స్‌ప్లోజివ్స్ సరఫరాలో కొరత ఏర్పడుతుంటుంది.
SME తయారీలో కీలకమైన అమ్మోనియం నైట్రేట్‌ను విదేశాల నుంచే దిగుమతి చేసుకోవాలి. కానీ, అమెరికా-ఇరాన్ యుద్ధంతో సముద్ర మార్గంలో ఓడల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. దీని ఎఫెక్ట్‌తో సింగరేణికి SME సరఫరా చేసే కాంట్రాక్ట్ ఏజెన్సీలు.. గత వారం రోజులుగా సప్లైని భారీగా తగ్గించేశాయి.
దీంతో రోజుకు కనీసం 400 టన్నుల SME కూడా ఓసీపీలకు అందడం లేదు. ముందు ముందు కూడా డిమాండ్‌కు తగ్గట్లుగా దీనిని సరఫరా చేయడం కష్టమేనని ఆయా సంస్థలు తేల్చిచెబుతున్నాయి. ఈ పేలుడు పదార్థాల కొరతతో గనుల్లో మట్టి (ఓవర్ బర్డెన్) తొలగింపుతో పాటు బొగ్గు బ్లాస్టింగ్ పనులకు బ్రేకులు పడుతున్నాయి.
కలవరపెడుతున్న డీజిల్ కొరత
బొగ్గు ఉత్పత్తి, మట్టి (ఓవర్ బర్డెన్) తొలగింపు పనుల కోసం సింగరేణి సంస్థ భారీ స్థాయిలో ఇంధనాన్ని వినియోగిస్తోంది. ఓసీపీల్లోని షావల్స్, డంపర్లు, డోజర్లు వంటి భారీ వాహనాలకు, యంత్రాలకు రోజూ 10 లక్షల లీటర్లకు పైగా డీజిల్ అవసరమవుతుంది.
అయితే, యుద్ధం ఎఫెక్ట్‌తో విదేశాల నుంచి ఇంధన సరఫరా బాగా తగ్గిపోయింది. ఈ పరిణామాల నేపథ్యంలో.. ఓసీపీల్లో మట్టి వెలికితీసే కాంట్రాక్ట్ ఏజెన్సీలకు ఇక డీజిల్ సరఫరా చేయలేమని హెచ్‌పీసీఎల్, ఐఓసీఎల్, రిలయన్స్ సంస్థలు నాలుగు రోజుల క్రితమే కుండబద్దలు కొట్టాయి.
దీంతో చేసేది లేక మట్టి వెలికితీసే (ఓబీ) కాంట్రాక్ట్ సంస్థలు.. డీజిల్ కోసం నేరుగా సింగరేణినే ఆశ్రయిస్తున్నాయి. అసలే ఇంధన కొరతతో సతమతమవుతున్న సింగరేణికి.. వీరికి కూడా డీజిల్ సమకూర్చడం తలకుమించిన భారంగా మారింది.
ఒకవేళ యుద్ధం ఇలాగే కొనసాగితే.. రాబోయే రోజుల్లో పేలుడు పదార్థాలు, డీజిల్‌తో పాటు ఇతర ఇంధనాల కొరత మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. ఇప్పటికే గత పది రోజులుగా ఓపెన్ కాస్ట్ గనుల్లో మట్టి (ఓబీ) తొలగింపు, బొగ్గు ఉత్పత్తి క్రమంగా పడిపోతుండటం సింగరేణి యాజమాన్యాన్ని తీవ్ర కలవరపెడుతోంది.











Leave a Reply