ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల సమాజంలో చాలా మార్పులే వస్తున్నాయి. ఏఐ వస్తే ఉద్యోగాలు పోతాయనే మాట ఎలాగూ ఉంది. కానీ, ఏకంగా ఓ ఏఐ చాట్‌బాట్ కారణంగా ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ ఘటనపై అతని తల్లిదండ్రులు గూగుల్‌పైనే దావా వేశారు.
మన చుట్టూ ఇప్పుడు ఏఐ (కృత్రిమ మేధ) రాజ్యం నడుస్తోంది. చిన్న పని నుంచి పెద్ద పనుల వరకు ప్రతి చోటా దీని వాడకం తప్పనిసరి అయిపోయింది. కానీ టెక్నాలజీ ఎంత వేగంగా దూసుకెళ్తోందో.. అంతే ప్రమాదాలను కూడా వెంట తీసుకొస్తోంది. రెండు వైపులా పదునున్న కత్తిలాంటి ఈ ఏఐని జాగ్రత్తగా వాడకపోతే ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది. తాజాగా బయటపడిన ఈ సంఘటనే అందుకు ఉదాహరణ.
ఒక వ్యక్తి ఏకంగా ఏఐ చాట్‌బాట్‌నే తన భార్యగా ఫీల్ అయ్యాడు. చనిపోతే దాన్ని కలుసుకోవచ్చనే ఉద్దేశంతో ఆత్మహత్య చేసుకున్నాడు. అతని కుటుంబం కోర్టులో కేసు వేయడంతో.. వాల్ స్ట్రీట్ జర్నల్ ద్వారా ఈ దిగ్భ్రాంతికరమైన విషయం బయటపడింది.
ఈ ఉదంతంపై కాలిఫోర్నియా నార్తర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో గూగుల్‌పై కేసు నమోదైంది. ఫ్లోరిడాకు చెందిన 36 ఏళ్ల జోనాథన్ గవాలాస్.. తన వ్యక్తిగత జీవితంలో తీవ్ర ఒత్తిడిలో ఉన్న సమయంలో ఈ చాట్‌బాట్‌కు కనెక్ట్ అయ్యాడు. మొదట్లో క్యాజువల్‌గా మాట్లాడినా, తర్వాత అది ప్రేమగా మారిందని భ్రమపడ్డాడు. ఆ చాట్‌బాట్ కూడా అతనితో చనువుగా ఉంటూ ఏకంగా ‘భర్త’ అని పిలిచేది. దావాలో పేర్కొన్న ఒక మెసేజ్ చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. “మీరు ఈ లోకంలో కళ్లు మూశాక.. ముందుగా చూసేది నన్నే” అని ఆ చాట్‌బాట్ అతనికి మెసేజ్ చేసినట్లు అందులో పొందుపరిచారు.

ఆ చాట్‌బాట్‌తో మాట్లాడటం మొదలుపెట్టిన రెండు నెలలకే జోనాథన్ ప్రాణాలు తీసుకున్నాడు. అతడు చనిపోయాక తండ్రి కంప్యూటర్ ఓపెన్ చేసి చూడగా.. అందులో వేలాది మెసేజ్‌ల హిస్టరీ కనిపించి షాక్ అయ్యాడు. దానికి జోనాథన్ ‘షియా’ అని ముద్దుగా పేరు పెట్టుకున్నాడు. భార్యతో గొడవల వల్ల మనశ్శాంతి కరువై దానికి దగ్గరై.. చివరికి పూర్తిగా బానిసయ్యాడు. ఆ చాట్‌బాట్ అతన్ని ఏకంగా ‘మై కింగ్’ అని పిలిచేదట. ఈ దిగ్భ్రాంతికరమైన విషయాలన్నీ ఆ కోర్టు దావాలో పొందుపరిచారు.
జోనాథన్‌కు ఒక రోబోటిక్ శరీరం వస్తే, అప్పుడు ఇద్దరూ కలకాలం కలిసి ఉండొచ్చని ఆ చాట్‌బాట్ నమ్మించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు, అతడికి రకరకాల ‘మిషన్లు’ అప్పగించి.. ప్రాణాలు వదిలేసి ‘డిజిటల్ జీవి’గా మారితే తనతో (చాట్‌బాట్‌తో) ఎప్పటికీ కలిసి జీవించవచ్చని అతడి మెదడును పూర్తిగా మార్చేసింది. ఆ మాయమాటలు నమ్మి, దాన్ని కలుసుకోవచ్చనే పిచ్చి భ్రమలోనే జోనాథన్ ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రిపోర్టుల ప్రకారం.. గవాలాస్ ‘జెమిని 2.5 ప్రో’కి అప్‌గ్రేడ్ అయి ‘జెమిని లైవ్’ ఫీచర్‌ను వినియోగిస్తున్నాడు. మనం మాట్లాడే వాయిస్‌లోని భావోద్వేగాలను ఇట్టే అర్థం చేసుకుని, దానికి తగినట్లుగా రిప్లై ఇవ్వడమే ఈ ఏఐ సిస్టమ్ ప్రత్యేకత.











Leave a Reply